BHAGAVATA KADHA-3    Chapters   

పశుపతితో యుద్ధము - కృష్ణ కృప

55

శ్లో || యత్తేజపాథ భగవాన్‌ యుధిశూలపాణి

ర్విస్మాపితః సగిరిజో7స్త్ర మదాన్నిజం మే |

అన్యే7పి చాహమమునైవ కలేవరేణ,

ప్రప్తో మహేంద్ర భవనే మహదాసనార్థమ్‌ ||

- భాగ. 1 స్వం. 15ఆ. 12 శ్లో.

''సీ|| పందికై పోరాడ ఫాలాక్షుఁడెవ్వని

బలమున నాకిచ్చెఁ బాశుపతము

నెవ్వని లావున నీమేన దేవేంద్రు

పీఠార్థముననుండు పెంపుఁగంటిఁ.....''

అట్టివాడు ''మనలను దిగనాడి చినయె మనుజాధీశా||''

- శ్రీ మదాంధ్ర భాగవతము.

ఛప్పయ.

అశ్వత్థామా భీష్మ ద్రోణ అరు కర్ణ ధనుర్ధర |

డరత రహత నిత ఆవ చారిహూ అతి బలవత్తర ||

దీక్షా దైకేఁ మోఇ, ఆవనే అస్త్ర లైఁన హిత |

పఠయో, ప్రకటే, ఇంద్ర, కహ్యో తప మేఁతుమ హోరత ||

తుమరే తప తేఁతుష్టహ్వై, తురత త్రిలోచన ఆయంగే |

లోకపాల, శివ అస్త్ర నిజ, ఆఇ సఖీ దే జాయంగే ||

అర్థము

అన్నా! ధర్మజా ! అశ్వత్థాముఁడు, భీష్ముఁడు, ద్రోణుఁడు, కర్ణుఁడు వీరు నల్గురు అతిబలవత్తరులగు ధనుర్ధరులని మీకు భయము. అప్పుడింద్రుఁడు నా హితమునుగోరి ప్రత్యక్షమై నాకు దీక్ష నొసంగి తపస్సు చేయవలసినదిని పంపెను. ఇంద్రుఁడు డిట్లనెను:-

అర్జునా ! నీ తపస్సుకు మెచ్చి వెంటనే త్రిలోచనుఁడగు శివుఁడు రాఁడలఁడు. శివుఁడు, లోకపాలురు వచ్చి నీకు వారి వారికఁగల అస్త్రముల నొసంగెదరు.''

భగవంతుడనేక విభూతులలో విభక్తమై భక్తుల నను గ్రహించును. ప్రపంచములో నేవ్యక్తిద్వారానైన మనకు మేలు కలిగెనా, అది శ్యామసుందరుఁడే ఆరూపమునఁ జేసనెననియుఁ, దన కృపావృష్టిని గురిపించెననియుఁ దెలిసికొనవలయును. ఆతఁడే మన మీఁదగల కృపచే సన్మార్గోపదేశము నిచ్చుచుండెను. ఇట్లాలోచించి ధర్మరాజిట్లనెను:- ''అర్జునా! ఇంకొకరైనచో భగవానుఁడలక్ష్యభావముతో ననుగ్రహించునేమో గాని, మనమీఁద నాతఁడు సర్వదా సాక్షాత్తుగ బ్రత్యక్షమై కృపఁజూపును. ఆయన కృపవలననే మనము విజయులమైతిమి. లేకున్న పరశురాము నెదిరించు సాహసము గల భీష్ముని ఎదుర్కొను సాహస మెమరికి కలదు? నీవు నాకువనవాసమునకు సంబంధించిన విషయము లను జెప్పితివి. ఇంక నచ్చట నుండఁగా జరిగిన విషయములు కొన్నిటిని జెప్పుము. ఇవన్నియు నాముఖమున జరిగినప్పటికి, నీనోట వినుచుండిన నాకవి నూతనములుగఁ దోఁచుచున్నవి. కృష్ణకథామృతమును వినిన నెవరకి తృప్తికలుగును?''

ధర్మరాజు వాక్యములను విని అర్జునుఁ డిట్లనెను:- ''రాజా! అనంతస్మృతులను ఈ చిన్ననాలుకతో నీయల్పకాల మున నెట్లు చెప్పఁగలను? కాని, చెప్పఁదగినంతవఱకు చెప్పెదను. దీనిని చెప్పుటచేతనే నాహృదయము తేలికయగుచున్నది. శోక, సంతాపములు తగ్గుచున్నవి. వనవాస దుఃఖములు సహింప రానివి. వాటి నన్నిటిని మనము శ్యామసుందరుని కృపచేతనే దాఁటఁగలిగితిమి. మీరు మీపైతృక రాజ్యమును బొందవలె నని కోరెడువారు. కాని, దుర్యోధనుని దుష్టస్వభావమును గనిపెట్టి యుద్ధము లేనిది ఆతఁడు రాజ్యము నీయఁడని మీరు గ్రహించితిరి. యుద్ధమనఁగానే మీకు రోమములు నిక్కపొడుచెడివి. ఆదాన, సంధాన, విసర్గ, సంహారములను చతుర్విధ ధనుర్విద్యా చరణముల నెఱిఁగిన భీష్మ, ద్రోణ, కర్ణ, అశ్వత్థామాదుల బలపరాక్రమములను స్మరించి, రాజ్యము మీకు దక్కదని మీకు భయము. సమస్త దేవతలు కలిసి వచ్చినను ఆ వీరులను జయింపలేరనిన నిఁకమానవుల సంగతి చెప్పనేల? మీరిదేచింతలో దీర్ఘనిశ్శ్వాసములు విడిచెడువారు. అజగరునివలె విషాదమున మునిఁగి ఇస్సురనుచుండెడివారు. ఇక గత్యంతరమేమియు లేకపోవుటచే వ్యాసుఁడిచ్చిన దీక్షను మీరు నాకిచ్చితిరి. దాని మూలమున చరాచరజ్ఞానము లభించి, ఇంద్రుని సమీపమునకు వెళ్లి దివ్యాస్త్ర శస్త్రములను సవిధిగఁబ్రాప్తింపఁ జేసికొనవచ్చును.

దీక్షనొసఁగి మీరత్యంత దుఃఖిత మనస్సుతో నన్నరణ్యమునకుఁదపస్సుచేయఁబంపిరి. మీ యాజ్ఞ ప్రకారము అగమ్యనిర్జన వనములోనిరి నేనొంటరిగా వెళ్ళితని. నాకు కృష్ణుఁడే ఆధారము. ఆతఁడు సర్వత్ర నాకు మేలే చేయును. నాయనిష్టములను, విఘ్నములను నాశమొనర్చును. సిద్ధులుకూడ వెళ్ళఁజాలని గంథమాదన పర్వతప్రాంత గోరారణ్యమునకు నేను తపస్సుచేయఁ బోయింతిని. ఆ ఏకాంతస్థానమున నాతండ్రియగు దేవేంద్రుని దర్శనమయ్యెను. ఆతఁడు నాతో నిట్లనెను:- ''ఈప్రదేశమున కధిపతి శూలపాణియగు విశ్వేష్వరుఁడు. నీవా తని నారాధించి ప్రసన్నునిఁ జేసికొనినచో నిన్ను నేను నశరీరముతో స్వర్గమునకుఁ బిలిపించుకొని అస్త్రశస్త్రముల నుపదేశించెదను.'' ఇట్లు చెప్పి దేవేంద్రుఁడంతర్థానమయ్యెను.

నా శ్యామసుందరుఁడే శివరూపమును ధరించెను. నా యిష్టదైవమున కాతఁడభిన్నరూపుఁడను భావనతో నేను త్రిశూల పాణియగు శివుని ధ్యానించి పూజించితిని. నాకు భయమును లేదు. చింతయును లేదు. నిర్భయుఁడనై ఉమాపతి నీలకంఠుని ఆరాధనములో నిమగ్నుడనైతిని.

ఒక దినమున నొక రాక్షసుడు వారాహ రూపమును ధరించి నన్ను జంపుటకు వచ్చుచుండుటము గాంచితిని. నాకు నా ద్వారకానాథుఁడు కలఁడను నాశ; అందువలన నేనెవరి నెదుర్కొనుటకును భయపడలేదు. తపస్సు చేయు సమయమున నేనెవరిని జంపఁదలఁపకున్నను, శూకరరూపమును ధరించి నా ప్రాణములు తీయుటకే వచ్చు నసురుని ఉసురులు గొనుటకై గాండీవధనస్సునకు కఱకు శరముల నెక్కించితిని. ఇంతలోనే నా ముందు భయంకరుఁడగు పొర భిల్లుఁడు, వాని భార్య ధనుర్బాణమలు ధరించి నావైపునకు వచ్చుచుండుటను గాంచితిని. ఆతఁడు కాలాంజన పర్వతసమానముగ వడ్డు పొడవు కలిగి నల్లగ భయంకరముగనుండెను. ఆతని కన్ను లెఱ్ఱగ మండిపడిపోవుచుండెను. వేలకొలఁది కిరాతులు, కిరాతస్త్రీలు ఆతని వెనుక హూఁ హూఁ అనుచుఁ బరువిడివచ్చుచుండిరి. వారందఱా తపోయోగ్యమైన శాంతప్రదేశమును తమ గగ్గోలుచే నశాంతముగను గోలాహలముగను నొనర్చిరిర.వారు స్వచ్ఛందము నన్నే లక్ష్యముగఁ బెట్టుకొని నిర్భయముతో వచ్చుచుండిరి. రాఁగానే ఆభయంకర కిరాత ధనుర్ధారి నన్ను గద్దించుచు నిట్లనెను:- ''నీ వెవఁడవు? ఇక్కడికి ఎందులకు వచ్చినావు? జాగ్రత్త! నీవు పొరపాటున నైన నీ వారాహుముపై బాణము విడువరాదు. ఇది నా వేఁట పంది. నీవు అహంకారముచే దీనిమీఁద బాణము వేసితివా నే నీ శూకరముతో నిన్ను యమపురి కంపెదను.''

ఒక సామాన్య ఆటవిక భిల్లుఁడిట్లు నిర్భయముగ నన్నుఁ గఠోరముగఁ బలుకుచున్నాఁడని నాకు మిక్కిలి కోపము వచ్చెను. నే నాతని మాటను లక్ష్యపెట్టక ఆ వారాహరూపధారి యగు రాక్షసుని బాణమునఁగొట్టితిని. ఆ భిల్లుఁడుకూడ ఒక బాణమును విడిచెను. రెండు బాణములు తగులటచే మూఁకుడను నా ధైత్యుఁడు తన వారాహరూపమును వదలి చచ్చి క్రిందపడెను. దైత్యుఁడు చచ్చెను గాని కిరాతునకు మిక్కిలి కోపము వచ్చెను. ఆతఁడు నాతో నిట్లనెను:- ''నీవు నేను కొట్టఁదలఁచిన జంతువు నేలఁగొట్టితివి? నేనుమొట్టమొదట చంపఁదలఁచిన దానిపైని నీవు బాణము నేల విడిచితివి?''

నేను క్రోధోద్రిక్తుడనై యిట్లంటిని:- ''పో, పో, ఊరకే వాగుచున్నావు. నీవెవ్వడఁవైన నాకేమి? నన్నుఁ జంపవచ్చిన పశువును గొట్టితిని. వీఁడు దైత్యుఁడు. నన్నుఁజంపవచ్చినాఁడు ధర్మము ననుసరించి వీనిని నేనే వధింపవలయును. నీవు వేటనియమములకు విరుద్ధముగ వర్తించుచున్నావు. ఇక్కడనుండి వెడలి పొమ్ము. లేకున్న నిన్ను యమపరురికంపెదను. నేనర్జుడనని నీ వెఱుఁగ నట్లున్నావు. ఈ గాండీవ సహాయమున శ్రీకృష్ణకృపచే దేవతలందఱను, ఇంద్రునిగూడ జయించితిని. నీ ప్రాణములమీఁద దీపి యుండిన నిప్పుడే యిక్కడనుండి నడువుము.''

నిర్భయుడై అభిల్లుఁడిట్లనెను:- ''నాకు నీ గాండీవ భయమునులేదు. నేను నీ మాటలను వినువాఁడను గాదు. నన్ను వెళ్లు మనుటకు నీ వెవరు? ఈ యరణ్యము మాది. దీనిలో మా యిష్టము వచ్చినట్లు మేము తిరిగెదము. మారాజ్యములోనికివచ్చి మా కార్యములలోజోక్యము కలుగఁజేసికొనుచు మమ్ములను వెళ్లుమందువా? ఈ శూకరము నాబాణము చేతనే చచ్చినది.''

నేను కుపితుఁడనై యిట్లంటిని:- ''ఊరకే వాగితివా, ఒక్కబాణమున మట్టుపెట్టెదను. వాగుడాపిపోవును. ఎక్కడో బయలుదేరి వచ్చినాఁడు రాజుకొడుకు. అరణ్య మందఱసొత్తు. నిజమునకు నీబోడి వ్లుెచ్ఛుండు రాఁగూడదు. నేనిక్కడ భూత నాథుఁడను శివుని గూర్చి తపస్సు చేయుచున్నాను.''

ఇదివిన యాభిల్లుఁడు నన్నవజ్ఞ చేయుచు నిట్లనెను:- ''నీవు భూతనాథుని, ప్రేతనాథుని, పిశాచనాథుని ఆరాధించిన నెవరికేమి? ఆమృగమును నేను కొట్టివలదనిన నేల కొట్టితివి?''

నేను రోషమున హాస్యముచేయ నవ్వుచు నిట్లంటివి:- ''నీవు చెప్పిన మాట వినవు. నీకును ఈ దైత్యుని గతియే పట్ట వలయును. నేను తపస్సు చేయుచుండఁగా హింసింపఁదలఁచుట లేదు; కాని నీకు కాలము ముగిసినది. మంచిది, కాచుకో'' ఇట్లని నేనొక తీక్షణ బాణమును భిల్లునిపై వైచితిని. బాణము వాని శరీరమునకుఁ దగులఁగానే రాతికి తుమ్మముల్లు గ్రుచ్చఁగానే విరిగిపోయినట్లు విరగిపోయెను. ఇది చూచి నే నాశ్చర్య పడితిని. నాక్రోధ మింక నధిక మయ్యెను. అంత నేను అర్థచంద్రాకార బాణముచే నాతని శిరస్సు ద్రుంప విడిచితిని. ఆతఁడు నవ్వుచు దానినిఁదనచేతఁ బట్టుకొనెను. అంత నేను అసంఖ్యాకములగు బాణములను ఆతనిపై వదలితిని. నలువైపులను ఆతని బాణములచేఁ గప్పివైచితిని. కాని యాతఁడు మేరు పర్వతములవలె నచంచలుఁడై నిలిచెను. ఒక్క బాణమైన నాతని శరీరములో గ్రుచ్చుకొనలేదు. నా యక్షయ తూణీరములోని బాణములన్నియు సమాప్తమయ్యెను. అప్పుడు నేను కొల్లగొట్టఁబడిన వ్యాపిరివలెను, విషపుతిత్తిని పెరకివేసిన పామువలెను, ఱక్కలు నరికిన పక్షివలెను. తెడ్డు, చుక్కాని, తెఱచాఁప కొయ్య విరిగిన నావవలెను, గొళ్లు, కోఱలు పెఱకివేసిన సింహము వలె నిస్సహాయుఁడనైతిని గాని సాహసమును వీడలేదు. నా ధనుస్సు యొక్క కొనచే వాని నావలకుఁ ద్రోసితిని. ధనుస్సు నాయన శరీరములోఁగ్రుచ్చునప్పటికి, ఆతఁడా ధనుస్సును సహజ స్వభావమునఁబట్టి లాగుకొనెను. ధనుస్సును లాగుకొనఁగానే నేను పగపట్టిన త్రాచువలె బుసలు కొట్టితిని. నడుమున కత్తితీసి నేనాతని గొట్టునప్పటికి అది తుంపులు తుంపులై క్రిందపడెను.

ఇఇఁక నాదగ్గఱ నస్త్రము లేమియు లేకపోవుటచే నడుము నకు గుడ్డకట్టి, ఆనతితోద్వంద్వయుద్ధముచేయ సమకట్టితిని. ఆతఁడు కూడ దానిక సిద్ధపడెను. నేనెంత పోరాడినను ఆతఁడచలమువలె నిలిచెను. శక్తికొలది నేను గ్రుద్దుచుంటిని, కాని ఆతనికి దెబ్బ తగులుటయే లేదు. పైగా నాచేయి నొప్పివేయుచుండెను. ఏదైన నొక లోహశిలపైఁ గొట్టుచున్నట్లు నాకు తోఁచు చుండెను. ఆతఁడచలుఁడై యున్నాఁడేయని నేనాతని నాబలము కొలఁది క్రిందఁబడవేయఁదలఁచునప్పటికి, ఆతఁడు తన బాహూవులచే నన్ను బిగించి వత్తెను. అప్పుడు నాకు కంబడి కప్పు కొన్నట్టు వెచ్చగ నుండెను. ఇఁక నాప్రాణములు పోవుచున్న వనుకొనుచుంటిని, నా నోటినుండి రక్తము పడుచుండెను. నేను మూర్ఛితుఁడనై క్రిందఁబడిపోయితిని. ఆతఁడు నవ్వుచు తన భిల్లపత్నితో నిలుచుండెను.

కొంచెము సేపటికి నాకు మూర్ఛ తెలిసెను. అంత నే నిట్లేడ్చితిని:- 'ఓ శ్యామసుందరా! ఇవ్వేళ నీభిల్లునిచే నోడింపఁ జేయుచున్నావా? నేను శంకరునిగూర్చి పార్థివపూజ చేయుచేన్నాను. మృణ్మయ ప్రతిమను జేసి నే నాశుతోషుఁడగు పశుపతిని బూచించుచున్నాను.' నేనుపార్థివ శివలింగముపై మాలవేసితినా, ఆ మాలపోయి ఆతని మెడలో నుండెడిది. ఈ భిల్లవేషధారి శంకరుఁడని నేనప్పుడు గ్రహించితిని. నేను వెంటనే ఆతని పాదములమీఁదఁబడితిని, కికరాతరూపధారియగు నా శంకరుఁడు తన ఛద్మవేషమును మార్చి సాక్షాత్తుగ శంకరరూపమునను, గౌరీ రూపమునను ప్రత్యక్షమైరి. ఆశ్యామసుందరుని కృప చేతనే నేను శివుని సంతోషపరుపఁగలిగితిని. పినాకపాణియగు పశుపతి నా పురుషార్థమునకు మెచ్చుకొని, నన్ననేక విధములఁ బ్రశంసించుచు నిట్లనెను:- ''అర్జునా! నేను నీయెడలఁ బ్రసన్నుఁడ నైతిని.నీకు కావలసిన వరమడుగుము. ఇచ్చెదను.'' నేను విశ్వవిజయుఁడ నగునట్లు వరమడిగితిని. ఆతఁడు కృపతో నాకు ప్రసన్న తాపూర్వకముగ వరము లొసంగి, తన పాశుపతాస్త్రమును గూడ యిచ్చెను. రాజా! ఎవని కృపచే నేనింత సాహాసము చేసితినో, ఆతఁడీ ధరాధామమును వదలి వెళ్ళి పోయెను. ఇప్పుడు నేను నిర్బలుఁడనైతిని. అక్కడే యింకొక విచిత్ర సంఘటన జరిగినది. అది ఇది-

BHAGAVATA KADHA-3    Chapters